ఎక్కడో ఒక పల్లెటూరు .. రెల్లు గడ్డితో కప్పిన పూరిల్లు .. ఇంటి ముందు ఆరు బయట మెల్ల .. నులక మంచం ..వేసవి సాయంత్రం !
దూరంగా రోట్లో ఏదో రుబ్బుకుంటూ హడావిడిగా నాయనమ్మ .. నులక మంచం చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ వేసవి సెలవులకు దిగిన మనమల్లు, మనవరాళ్లు !!
రోట్లో రుబ్బటం పూర్తవటం తో హడావిడి గా చుట్టిల్లు (వంటిల్లు) లోకి వెళ్లిన నాయనమ్మ !! వెళ్లిన కాసేపటికే సుయ్ సుయ్ మని సెగలు , తాలింపు గుమ గుమ లు !!
క్షణాల్లో వేడి వేడి అన్నం ప్లేటు , నెయ్యి గిన్నె తో నాయనమ్మ ప్రత్యక్షం ! అప్పుడే రుబ్బిన పండు మిరపకాయ గోంగూర పచ్చడిని వేడి అన్నం లో కలిపి , నెయ్యి వేసి ఒక్కొక్కరికి వంతు వంతునా అందరికి ముద్దలు కలిపి పెడుతుంటే, మళ్ళీ మన వంతు వచ్చేవరకు కూడా ఆగలేని ఆత్రం ! అంత రుచి !
ఎన్ని భోజనాలు చేసిన ఆ భోజనం వేరు !! ఎన్ని సార్లు అన్నం కలిపినా నాయనమ్మ కలిపి పెడితే వేరు .. ఎన్ని సార్లు గోంగూర తిన్న ఆ గోంగూర వేరు !
ఇప్పుడు, ఆ వేసవి సెలవలు మళ్ళీ రావు , ఆ ఇల్లు లేదు .. పిలిచినా నాయనమ్మ రాదు !
ఉన్నదల్లా అప్పటి ఆ రుచిని మళ్ళీ ఆవిష్కరించాలి అన్న నిజాయితీ అయిన ప్రయత్నం !